తిరుమల
వేంకటేశ్వరస్వామి దర్శనం
ఒకసారి మేము మా బంధువులతో కలిసి తిరుమల వెళ్లాము.
కొండమీద వరహా-2 గెస్ట్ హౌస్ లో ముందుగానే రూములు బుక్ చేసుకున్నాము. మరునాడు ఉదయం
మాకు స్వామివారి దర్శనం ఉన్నది. గతంలో మేమందరమూ కూడా శ్రీవారి సేవలో
పాల్గొన్నప్పుడు శ్రీవారి పుష్పవనంలో శ్రీవారికి అలంకరణ చేసే పూలమాలలను
తయారుచేయడములో సహాయము చేశాము. ఆ పుష్పవనము అక్కడ ఉన్న వివిధరకాల పుష్పాలు అక్కడ
మాలలు తయారుచేసే విధానము ఎంతో బాగుంటుంది. అందుకని ఆరోజు అందరమూ కలిసి
పుష్పవనానికి వెళ్లాము. ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఎంతో అందంగా ఉండే తిరుమలలో మనము
చూసే అనేక ప్రదేశాలలో ఈ పుష్పవనంలో విహారం ఒక మధురానుభూతిగా ఉంటుంది. ఆరోజు అక్కడే
గడిపి, మరుసటి ఉదయం తొందరగా బయలుదేరి మాడవీధులలో నుంచి
ఒక ప్రదక్షణము చేసి దర్శనానికి వెళ్దాము అనుకుంటూ ఎవరి గదులకి వాళ్ళము
చేరుకున్నాము.
అనుకున్నట్లుగానే ముందుగా తయారయిన వాళ్ళు అందరి
గదులదగ్గరికి వెళ్ళి హడావిడి పెట్టి సరదా కబుర్లతో బయలుదేరాము. అప్పుడు సమయం
సుమారుగా ఉదయం 5 గంటలు. వరాహ-1 గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే మాలో ఎవరో కాఫీ
తాగుదామా అన్నారు. ఆడవారు ఇప్పుడు వద్దు దర్శనం తరువాత అన్నాకూడా మగవారందరమూ అక్కడ
కాఫీ తాగి బయలుదేరాము.
ముందుగా శ్రీవారి
సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహద్వారానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి గుడికి వెళ్లాము. బేడీ ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి
ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటారు. స్వామి
చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే ఆయన తల్లిగారు చేతికి బేడీలు తగిలించారట.
అందుకని ఈయనకి ఆపేరు వచ్చిందట. అక్కడ స్వామికి నమస్కారం చేసుకుంటుంటే మైకులో యం.
యస్. సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. వాతావరణం చల్లగా ఎంతో
ఆహ్లాదకరంగా ఉంది.
ఆలయ ముఖద్వారం దగ్గర గొల్ల మండపం దగ్గరికి వచ్చి
అక్కడ ఒకసారి నమస్కారము చేసుకుని, సహస్ర దీపాలంకరణ సేవ జరిగే చోటుకి
చేరుకుని “ఇక్కడే కదా సేవ జరిగేది” అనుకుంటూ ముందుకి కదిలాము. మాలో ఒకరు తల
పైకెత్తి చూస్తూ “ఇటు చూడండి. వేంకటేస్వరస్వామి పాచికలు ఆడుతున్న చిత్రం ఎంత
బావుందో” అన్నారు.
అందరమూ అటుచూసి నమస్కారము చేసుకుని ఇంకొంచం ముందుకి
వెళ్ళిన తరువాత అక్కడ ఎడమవైపున ఉన్న ఆళ్వారుల సన్నిధికి నమస్కారము చేసుకుని
ముందుకి వెళుతుంటే, అక్కడ ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి దర్శనానికి వెళుతున్న భక్తులు
“గోవిందా, గోవింద అంటూ చేస్తున్న గోవిందనామ స్మరణకి మనసు
పులకరించింది.
కొంచం ముందుకి వెళ్ళిన తరువాత మళ్ళీ ఎడమవైపున మరొక గెట్ చూస్తూ కుడివైపుకి తిరిగాము. అలా ముందుకి వెళుతూ ఉంటే దూరంగా కనిపిస్తున్న స్వామి వారి బంగారు గోపురం చూస్తూ ఆనందం పొందాము.
ఆ తరువాత కుడివైపున స్వామివారి పుష్కరిణికి ప్రక్కనే ఉన్న భూవరాహస్వామి ఆలయానికి వెళ్లాము. ఈ ఆలయం వేంకటేశ్వరస్వామి ఆలయం కంటే ముందునుంచి ఉన్నది అని చెబుతూ ఉంటారు. వేంకటేశ్వరస్వామివారికి ఈయన ఇక్కడ స్తలము ఇచ్చినందుకు ప్రతిఫలంగా తనకోసం వచ్చే తన భక్తులు ముందుగా భూవరాహస్వామిని దర్శనం చేసుకుంటారు అని వేంకటేశ్వరస్వామివారు చెప్పారుట.
అక్కడ భూవరాహస్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చి వేంకటేశ్వరస్వామి ఆలయం వైపు వెళుతుంటే అక్కడ స్వామివారి గజరాజులు కనిపించారు. అందరమూ వారికి నమస్కరిస్తే తొండంతో మమ్మల్ని ఆశీర్వదించాయి. పుష్కరిణి ప్రక్కనుంచి అలాగే మళ్ళీ ఒకసారి స్వామివారి ముఖద్వారం దగ్గర నమస్కరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు వెళ్లాము.
ఇక క్యూకాంప్లెక్స్ లో వడి వడిగా అడుగులు వేస్తూ సెక్యూరిటీ వారి చెకింగులని పూర్తిచేసుకుని ఆలయ ముఖద్వారం దగ్గరకి వచ్చి తప్పనిసరిగా నీళ్ళల్లో ముంచవలసిన కాళ్లని ఇష్టపూర్వకంగా ముంచి కాళ్ళు కడుగుకొని ఆలయ ప్రవేశం చేసి కుడి ప్రక్కకి తిరిగి చూడగానే క్రింద బుడిపతో నిలువుగా వేళ్లాడుతున్న గునపం కనిపించింది.
ఈ గునపంతోనే అనంతాచార్యులవారు వేంకటేశ్వరస్వామివారిని
కొట్టారుట. అది గడ్డంమీద తగిలినందువలననే స్వామివారికి గడ్డం దగ్గర
బొట్టుపెట్టినట్లుగా చందనం పెడతారుట. అలాగే కొంచం ముందుకి వెళ్ళి ఎడమప్రక్కగా చూస్తే
వేంకటపతి రాయలు, అచ్యుతరాయలవారు ఆయన ప్రక్కగా వరదరాజఅమ్మణ్ణి కనిపించారు. అక్కడే కుడిప్రక్కగా చూస్తే
శ్రీకృష్ణదేవరాయలవారు, తిరుమలదేవి, చిన్నమదేవి
కనిపించారు.
అలా ఒక్క అడుగు వెయ్యగానే రంగ మండపము దానిలో తులాభారము కనిపించాయి. ఈ రంగ మండపములో ఇదివరకు స్వామివారి వాహనాలను ఉంచేవారట. కొంచం ముందుకి వెళ్ళి చూస్తే రాజా తోడరమల్లు విగ్రహాలు కనిపించాయి. ఆ ప్రక్కనే ఎడమవైపుగా శ్రీవారి నిత్యకళ్యాణం జరిగే ప్రదేశం ఉంది. ఒకరినొకరు తోసుకుంటూ కదులుతూ ఉండే క్యూలైనులోనుంచి ఇవన్నీ చూసుకుంటూ ద్వజస్తంభం దగ్గరికి చేరుకున్నాము.
ఆ ద్వజస్తంభానికి దూరంనుంచే నమస్కారం చేసుకుని ముందుకు
వెళుతూ తరువాతి గుమ్మం దగ్గర నమస్కారం చేసుకుంటూ ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఎడమవైపుకి
చూస్తే అక్కడ గోడమీద స్వామివారితో పాచికలాడుతున్న హాతీరామ్ బాబా చిత్రం కనిపించింది.
ఇంకొంచం ముందుకి వెళ్ళినతరువాత క్యూలైనులో కొంతమందిని
ఎడమవైపున ఉన్న వరదరాజస్వామి ఆలయం ప్రక్కనుంచి, మరికొంతమందిని వరదరాజస్వామి ఆలయం ముందునుంచి
పంపుతున్నారు. గోవిందా గోవింద అంటూ మారు మ్రోగుతున్న గోవిందనామ సవ్వడిలో మా
అదృష్టం వలన మేము వరదరాజస్వామి ముందునుంచి వెళుతూ నమస్కారం చేసుకున్నాము.
మరికాస్త ముందుకి వెళ్ళి ఇక
స్వామివారి ఆనందనిలయంలో అడుగుపెట్టాము. “ఓం నమో వేంకటేశాయ” అని వినిపిస్తూ ఉంటే తన్మయత్వంతో మనసులో ఆ వేంకటేశ్వరస్వామిని
స్మరిస్తూ జనంతో పాటుగా కదులుతూ తలతిప్పి గరుక్మంతులవారి దర్శనం చేసుకున్నాము.
ముందుకి చూస్తే బంగారువాకిలి అటు ఇటు జయ విజయులు దూరంగా
పుష్పాలంకరణలో ఆ శ్రీనివాసస్వామి కనిపించగానే ఇంక ఏ ఇతర విషయాలు ఏమీ
గుర్తుకురాలేదు. భక్తులందరిలోను ఉత్సాహం పెరిగిపోయింది. గోవిందనామ హోరు తారా
స్తాయిలో ఉన్నది. మన ప్రమేయం లేకుండానే ముందుకు వెళుతున్నామనే ధ్యాసని ప్రక్కన
పెట్టి స్వామిని మరింత దగ్గరగా చూస్తూ బంగారువాకిలిని మనసులోనే నమస్కరించుకుని
లోపలికి అడుగు పెట్టాము.
స్వామివారిని దగ్గరగా చూస్తున్నామన్న ఆనందం మా అందరి
ముఖాలలో తాండవిస్తోంది. ఎట్టకేలకు స్వామి ముందుకి చేరుకున్నాము. అక్కడ నిలబడే
కొన్ని సెకెండ్లలో స్వామిని బాగా చూడటానికి సిద్దంగా ఉన్న మేము ముందుగా భోగ
శ్రీనివాసమూర్తివారి దర్శనం చేసుకుని, తరువాత మూలవిరాట్టు స్వామివారి పాద
దర్శనం చేసుకుని నమస్కరించి, అభయహస్తంతో మమ్మల్ని
ఆశీర్వదిస్తున్న అనుభూతి పొందుతూ వక్షస్తలంలో ఉన్న శ్రీదేవి, భూదేవి అమ్మవార్లని దర్శనం
చేసుకుని, శంఖ చక్రాలకు నమస్కరించి తిరునామంతో నవరత్న కిరీటం ధరించి, గడ్డం దగ్గర చందనంతో ఉన్న
శ్రీ వేంటేశ్వరరుని తనివితీర చూశాము. ఆనందంతో కాసేపు కళ్ళు చెమ్మగిల్లాయి.
అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది “నడవండి, నడవండి” అని చెబుతుంటే తప్పనిసరిగా
బయటికి వచ్చి అంతటి స్వామిని కుమారునిగా
చేసుకుని ఆ ప్రక్కగా ఉన్న వకుళమాత ఆశీర్వాదం తీసుకొని తరువాత ఆంజనేయస్వామికి
నమస్కరించి అక్కడ అయ్యవార్లు ఇస్తున్న తీర్ధ ప్రసాదం తీసుకుని భక్తులందరితో పాటుగా
ఆ బంగారు భావివద్ద కూర్చుని స్వామివారి బంగారు గోపురం వైపు చూస్తూ “మమ్మల్ని
చల్లగా చూడు స్వామీ” అంటూ మనసులలోని కోరికలని అన్నీ చెప్పుకుని, ఇక ప్రదక్షిణదిశగా బయలుదేరి
ఆ ముందు ఉన్న పరకామణిలో స్వామివారి డబ్బుని లెక్కపెట్టడం చూస్తూ అలాగే కొంచం
ముందుకి వెళ్ళి స్వామివారికి కావలసిన చందనం తీస్తున్న ఆయ్వవార్లని చూసి, అక్కడవున్న మెట్లమీద
నిలబడి విమాన వేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకుని, ఇంకొంచం ముందుకి వెళ్ళి
అక్కడవున్న భగవద్ రామానుజులవారికి నమస్కారమ చేసి ఆ తరువాత స్వామివారి హుండీని చేరుకుని కానుకలని
సమర్పించి, ఆ ప్రక్కనే గోడమీద ఉన్న శ్రీమహాలక్ష్మి అమ్మవారికి నమస్కరించి, అక్కడవున్న యోగనరసింహస్వామివారి
దర్శనం చేసుకుని, ఆలయ నిర్మాణంలో ఈశాన్య భాగంలో మొదటగా
ప్రాణప్రతిష్టచేసిన స్తంభంగా చెప్పే స్తంభానికి నమస్కరించి, ఆ ముందున స్వామివారి
కోసం కర్పూరం నూరే బండ మీద చేతితో వ్రాసి ఏదో తెలియని ఆనందం పొందాము. ప్రతి ఒక్కరి
ముఖములో “ఈ జన్మకి ఇది చాలుకదా అన్నట్లుగా ఆనందం కనిపిస్తోంది.
బయటికి వస్తుంటే ప్రసాద వితరణ దగ్గర దద్దోజన ప్రసాదం
అందుకున్నాము. ఆ సందడిలోనే ప్రసాదం తిని అక్కడే చేతులు కడుగుకుని, మళ్ళీ ఒకసారి స్వామివారి
వైపు చూసి నమస్కరించుకుని బయటికి వచ్చాము.
“మాలో కొందరు అందరి లడ్డూ తికట్లు తీసుకుని లడ్డూ కౌంటరు వైపు వెళితే మరికొందరు వారి వారి రూములకి చేరుకున్నారు.
“ఓం నమో వేంకటేశాయ”














